v

బ్రహ్మ శ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి


బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సుప్రసిద్ధ వేదశాస్త్రవిద్వాంసులు. భారతదేశంలో ఉన్న అరుదైన పండితులలో ఒకరు. వేదశాస్త్రములను శాస్త్రీయపద్ధతిలో అధ్యయనం చేసిన పండితులు. బాల్యంలోనే వేదవిద్యాభ్యాసాన్ని ప్రారంభించి కృష్ణయజుర్వేదంలో ఘనాన్తాధ్యయనం పూర్తి చేసారు. తరువాత శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతులైన శ్రీ పరమాచార్య స్వామివారి ఆజ్ఞతో ప్రాతిశాఖ్యాది లక్షణగ్రంథములను అధ్యయనం చేసి “సలక్షణ ఘనపాఠీ” అనే బిరుదును సంపాదించుకున్నారు. సంస్కృత సాహిత్యంలో కాళిదాసాది మహాకవులయొక్క కావ్యములు, నాటకములు, అలంకారములు అధ్యయనం చేసి సంస్కృతంలో మంచి పాండిత్యాన్ని పొందారు. వేదోక్తములైన యజ్ఞయాగాదికర్మలకు సంబంధించిన శ్రౌతప్రయోగమును అధ్యయనం చేసి శ్రౌతవిజ్ఞానాన్ని కూడా సంపాదించారు.

వ్యాకరణ, మీమాంస, తర్క, వేదాన్తశాస్త్రముల అధ్యయనము చేసి అనేక శాస్త్రసభలలో వాక్యార్థరూపంలో వారి పాండిత్యమును ప్రదర్శించి గొప్ప శాస్త్రపండితులుగా పేరుపొందారు. భారతీయ ఆస్తిక దర్శనములు – నాస్తిక దర్శనములు అనే విషయంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి M.A. డిగ్రీ పట్టభద్రులైనారు. “18 ఉపనిషత్తులలో అద్వైతసిద్ధాన్తానుసారము భగవత్సాక్షాత్కారవిధానము” అనే విషయముపై పరిశోధన ప్రబంధాన్ని సమర్పించి రాష్ట్రీయ సంస్కృత సంస్థానం నుండి “విద్యావారిధి”Ph.D పట్టాను అందుకున్నారు. వేదములకు శ్రీ సాయణాచార్యుల వారు రచించిన వేదభాష్యమును అధ్యయనం చేసి శిక్షావ్యాకరణాది షడంగములతో, న్యాయమీమాంసాది శాస్త్రములతో కూడిన వేదభాష్యపరీక్షలో ఉత్తీర్ణులయి “సాంగ స్వాధ్యాయ భాస్కర” అనే బిరుదును సొంతం చేసుకున్నారు.

భారతదేశంలోని ప్రసిద్ధమైన వేదవిద్యాపరీక్షాకేంద్రములలో చాలాకాలం పరీక్షాధికారి స్థానాన్ని అలంకరించి వేదపరీక్షలు నిర్వహించారు. అనేక వేదసభలలో ఘనస్వస్తులను నిర్వహించిన గొప్ప ఘనపాఠులు. ఘనస్వస్తి నిర్వహణలో వారికి వారే సాటి. శ్రీమద్వాల్మీకి రామాయణం, మహాభారతం, అష్టాదశపురాణములపై అనేక ప్రవచనములు చేసిన గొప్ప పౌరాణికులు. భగవద్గీత, బ్రహ్మసూత్ర భాష్యము, ఉపనిషత్తులు, వివేక చూడామణి, సౌందర్య లహరి, శంకరవిజయము మొదలైన ఆధ్యాత్మిక గ్రంథములపై అనేక ఉపన్యాసములు చేసిన అధ్యాత్మవిద్యా ప్రబోధకులు. కేవలం సభలలో మాత్రమే కాక ప్రసారమాధ్యమం ద్వారా రేడియో, టీవీల రూపంలో అనేక ధార్మికప్రవచనములు చేసిన గొప్ప ధార్మికోపన్యాసకులు. కురుక్షేత్రం, బృందావనం, నైమిశారణ్యం మొదలైన పుణ్యక్షేత్రములలో భాగవత సప్తాహ జ్ఞాన యజ్ఞ రూపంగా భాగవతసప్తాహములు చేసిన పరమ భాగవతోత్తములు.

భారతదేశ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆధ్యాత్మిక పీఠములు, మఠములు, ధార్మిక సంస్థలు, విశ్వవిద్యాలయములు ఇలా అనేకమంది వీరి పాండిత్యాన్ని గుర్తించి అనేక బిరుదులతో సత్కరించి గౌరవించారు.

శ్రీ కాంచీ కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేన్ద్ర సరస్వతీ స్వామివారు, శ్రీశ్రీశ్రీ జయేన్ద్ర సరస్వతీ స్వామివారు, శ్రీశ్రీశ్రీ శంకర విజయేన్ద్ర సరస్వతీ స్వామివార్లు వేరు వేరు సందర్భాలలో “అద్వైత వేద రక్షామణి, అద్వైతభూషణమ్, విద్యారణ్య వేదభాష్య పురస్కారం” అనే బిరుదులతో సత్కరించి అనుగ్రహించారు. శ్రీ కాంచీ కామకోటి పీఠమ్ – పాలమూరు శాఖవారు “సాంగ వేద వాక్పతి” అనే బిరుదుతో సత్కరించారు.

అవధూత దత్త పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారు, శ్రీశ్రీశ్రీ దత్త విజయానన్ద తీర్థ స్వామివార్లు పలు సందర్భాలలో “ఆస్థాన విద్వాన్, వేద నిధి, వేదార్థ నిధి” అనే బిరుదులతో సత్కరించి అనుగ్రహించారు.

త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ మఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామివారు “జీయర్ పురస్కారం” తో అనుగ్రహించారు. చెన్నైలోని ఆండవన్ ఆశ్రమం వారు “సలక్షణ విచక్షణ” అనే బిరుదుతో సన్మానం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు “సలక్షణ ఘనపాఠీ” అనే బిరుదుతో సత్కరించారు.

హైదరాబాద్ లోని శ్రీ శంకరభక్త సభా ట్రస్ట్ వారు “ఆమ్నాయ వాచస్పతి, శృతి భూషణమ్” అనే బిరుదులతో సత్కరించారు. హైదరాబాద్ లోని ఆర్ష విజ్ఞాన పరిషత్ వారు “ఆర్ష విజ్ఞాన నిధి” గా గుర్తించి గౌరవించారు. హైదరాబాద్ లోని శ్రీమదగ్నిహోత్రి వేదభాష్య విద్వత్సభ వారు “పండిత రత్న” అనే బిరుదుతో సత్కరించారు. హైదరాబాద్ లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం వారు “ఉత్తమ సంస్కృత పండిత” పురస్కారాన్ని అందజేసి సత్కరించారు.

తెనాలిలోని రామలింగేశ్వర వేద విద్యా ట్రస్ట్ వారు “స్వాధ్యాయ చతురానన” అను బిరుదును సమర్పించి సత్కరించారు. నరసరావుపేటలోని శ్రీ వ్యాసపీఠం వారు “శ్రీ వ్యాసభారతీ వాచస్పతి” అనే బిరుదుతో సత్కరించారు. నాసిక్ లోని గురు గంగేశ్వరానంద జీ ప్రతిష్ఠానం వారు “వేద వేదాంగ పురస్కారాన్ని” అందజేసి సత్కరించారు. బెంగళూరులోని భారతీయ విద్యా భవన్ వారు “వేద ప్రశస్తి” పురస్కారాన్ని సమర్పించి సన్మానించారు. తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారు “మహా మహోపాధ్యాయ” అనే బిరుదును అందించి సత్కరించారు. వేదశాస్త్రములలో సంస్కృత సాహిత్యంలో వారు చేసిన విశేషమైన పరిశ్రమను గుర్తించి భారతదేశ ప్రభుత్వం “రాష్ట్రపతి పురస్కారాన్ని” అందజేసి గౌరవించింది.

సనాతన ధర్మం, వేదశాస్త్రములు, పురాణేతిహాసములు ఇలా అనేక విషయములపై గ్రంథరచనలు చేసిన గ్రంథకర్తలు. కృష్ణయజుర్వేదం లోని వాజపేయయాగమన్త్రములకు సంబంధించిన సాయణభాష్యమునకు ఆంధ్రానువాదమును చేసి “వాజపేయము” అను పేరుతో గ్రంథాన్ని రచించారు. ఈ గ్రంథావిష్కరణ సందర్భంగా “శృత్యర్థ వాచస్పతి” అనే బిరుదుతో సత్కరించారు.

శిక్షాగ్రంథములలో కౌణ్డిన్యశిక్షకు “ఘనామృతము” అనే పేరుతో సంస్కృత వ్యాఖ్యానాన్ని రచించారు. దీని ద్వారా లోకంలో ఘనపాఠముపై నెలకొన్న అప్రామాణికవాదాన్ని ఖండించి ఘనప్రామాణ్యాన్ని నిరూపించి ఘనపాఠిలోకానికి మహోపకారం చేశారు. ఈ సందర్భంగా వారిని రాజమండ్రిలోని దత్తాత్రేయ వేదవిద్యాగురుకులం వారు “ఘన సార్వభౌమ” “పండిత వరేణ్య” అనే బిరుదులతో సత్కరించారు.

అవధూత దత్తపీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి ఆదేశంతో సౌందర్యలహరి, శక్త్యుపనిషత్తులు, ప్రపంచసారతంత్రము మొదలైన మంత్రశాస్త్రగ్రంథములను పరిశీలించి స్వామీజీ వారు రచించిన దేవీ నవావరణ కృతులకు తెలుగులో వ్యాఖ్యానం చేసి “త్రిపురా విలాసము” అనే గ్రంథమును రచించారు. అదేవిధముగా స్వామీజీ వారి ఆజ్ఞ మేరకు వేదములలో పురాణములలో ఆర్ష గ్రంథములలో ఉన్నటువంటి పక్షులకు సంబంధించిన విషయములను సంకలనము చేసి “వేదాలలో పక్షి విజ్ఞానము” అనే పుస్తకాన్ని వ్రాశారు.

కాంచీ కామకోటి పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ చన్ద్రశేఖరేన్ద్ర సరస్వతీ స్వామివారితో జరిగిన సంభాషణలు, స్వామివారితో కలిగిన అనుభవాలను సంకలనం చేసి “పరమాచార్య జ్యోతి” అనే పుస్తకాన్ని వ్రాశారు. ఈవిధముగా తెలుగులో సంస్కృతంలో అనేక గ్రంథరచనలు చేసి పాఠకలోకానికి ఎంతో ఉపకారం చేశారు. అంతేగాక తెలుగు – సంస్కృత భాషలలో రెండు వందలకు పైబడి వ్యాసములను రచించారు.

కాంచీ కామకోటి పీఠాధిపతుల ఆదేశంతో హైదరాబాద్ లో బ్రహ్మశ్రీ R. వేంకటరామ సలక్షణ ఘనపాఠీ గారి నేతృత్వంలో నడుస్తున్న శ్రీ శంకర గురుకుల వేద పాఠశాలా - వేద భవనమునందు వేదభాష్యాధ్యాపకులుగా ఉంటూ లక్షణశాస్త్రంలో, వేదభాష్యంలో అనేకమంది విద్యార్థులను తయారు చేశారు.